రివ్యూ : ఆడియ‌న్స్‌తో ఆడుకొన్న 'ఉపేంద్ర 2'

01:19 , 0 Comments

దిమ్మ తిరిగి బొమ్మ కనపడుద్ది అంటారే - అలా ఉంటాయ్ ఉపేంద్ర సినిమాలు. తెరపై ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, అసలు ఏ పాత్ర ఎప్పుడు, ఎందుకు, ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఐన్ స్టీన్లు దిగిరావాలి. అసలేం తీస్తున్నాడో తనకైనా అర్థం అవుతుందా?  అనే డౌటు సామాన్య ప్రేక్షకుడికి రావడంలో తప్పేం లేదు. అంతా కన్ఫ్యూజనే. 'శుభం' కార్డుతో సినిమా మొదలెట్టిన ఘనత ఉపేంద్రది. మళ్లీ అలాంటి తలతిక్క సినిమా ఒకటి తీశాడు. ప్రేక్షకులతో బంతాట ఆడేసుకొన్నాడు. ఆ సినిమానే 'ఉపేంద్ర 2'.

కథేంటింటే.. - సారీ. అదొక్కటీ అడగొద్దు ప్లీజ్. ఎందుకంటే ఈ కథ కథేంటో ఎంత జుత్తు పీక్కున్నా అర్థమవ్వదు. బహుశా..  అర్థమవ్వాలంటే.. ఉపేంద్రకున్నంతబోల్డు జుత్తు మనకూ ఉండాలి. ఎందుకంటే.. జుత్తు ఎంత పీక్కున్నా మిగిలే ఉంటుంది కాబట్టి! భవిష్యత్తు గురించి ఆలోచించకూడదట.. అలా ఆలోచించడం వల్లే అన్ని సమస్యలూ వస్తున్నాయట.  అందరూ ఈ క్షణంలోనే బతకాలట. అలాంటి వాడి కోసం వెదుకుతుంటుంది హీరోయిన్. 'నువ్వు' (ఉపేంద్ర)కి అవే లక్షణాలుంటాయి. ఆయనే మన హీరోగారు. అందుకే నువ్వు చుట్టూ లవ్వూ లవ్వూ అంటూ తిరుగుతుంటుంది. ఈ 'నువ్వు'కి ఓ భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది తెలుసుకొని హై ఓల్టేజ్ తీగపై కాలేసినదానిలా కెవ్... అంటుంది హీరోయిన్. ఈ నువ్వు కోసం మాఫియా డాన్ పిచ్చికుక్కలా ప్రపంచమంతా తిరుగుతుంటాడు. ఓపోలీస్ ఆఫీసర్ కూడా 'నువ్వు' కోసం తెగ గాలించేస్తుంటాడు. ఈ 'నువ్వు' ఒక్కడే అనుకొంటే నువ్వుకి 'నేను' అనే మరో పిచ్చోడు కూడా తోడవుతాడు. అసలు వీరిద్దరూ ఎవరు? ఎవరి ఫ్లాష్ బ్యాక్ ఏంటి?  ఎవరి తిక్క ఎంత? ఆ తిక్కకున్న లెక్కేంటి? అనేది సినిమా చెప్పాలి.  ఇంత సినిమా చూసిన మన పరిస్థితేంటి?.. అన్నది దేవుడే చెప్పాలి.

ఈ నువ్వు ఏంటో, ఆ నేను ఏంటో.. మధ్యలో మనం ఏంటో.. ఎంత ఆలోచించినా అర్థం కాదు. చాలా చాలా చాలా కన్ఫ్యూజన్ స్టోరీ ఇది. అసలు ఉపేంద్ర కథ రాసుకొనే బరిలోకి దిగాడో, లేదంటే తనకు తోచింది చేసుకొంటూ వెళ్లాడో.. అనిపిస్తుంటుంది. ఉపేంద్ర సినిమాలన్నీ తిక్కతిక్కగా ఉంటాయన్నది మనకు తెలుసు. కానీ ఇంత చెత్త చెత్తగానూ ఉంటాయా అనేది మాత్రం ఈ సినిమాతోనే తెలుస్తుంది. ఇది చాలదన్నట్టు.. సినిమాలో ఓ చోట 5 నిమిషాల పాటు బొమ్మ కనిపించదు. స్ర్కీన్ అంతా తెల్లగా ఉంటుంది.  ప్రొజెక్టర్ ఆగిపోయిందో తెలీదు, టెక్నికల్ సమస్యో తెలీదు. ఉండాలో బయటకు వెళ్లాలో తెలీదు. ఆఖరికి ఓ వాయిస్ ఓవర్ వస్తుంది. మనలో జ్ఞాన జ్యోతుల్ని వెలిగించడానికి. 5 నిమిషాలు ఏం కనిపించకపోయే సరికి మీకు మీరు ఎన్ని ప్రశ్నలు సంధించుకొన్నారో తెలుసా??  అంటూ ఓ సైకాలజీ క్లాసు మొదలవుతుంది. ఏ సినిమాలో అయినా ఇంతకంటే టార్చర్ మరోటి ఉంటుందా..??

ఏ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో అర్థంకాదు. ఏ సన్నివేశం ఎందుకొస్తుందో అంతుపట్టదు. ఓ దశలో మనం చూస్తుంది సినిమానా, మనమసలు థియేటర్లోనే ఉన్నామా లేదంటే పిచ్చాసుపత్రికి వచ్చామా అనే డౌటూ వేస్తుంటుంది. థియేటర్లోంచి పారిపోవాలన్న కోరికను బలవంతంగా అణచుకొంటూ.. ఉపేంద్ర ఏమైనా అద్భుతం చూపిస్తాడా అన్న పిచ్చి ఆశతో, కూర్చుంటే.. సీను సీనుకీ ఉపేంద్ర ఓ సైకోలో భయపెడుతూనే ఉంటాడు. సెకండాఫ్ అంతా గందరగోళం. ఏదో చెప్పాలని ఇంకేదో చూపించి, ఇంకేదో మధ్యలో వదిలేసి, సడన్గా ఇంకో మేటర్లోకి వెళ్లిపోయి.. ఆఖరికి ఏదీ చెప్పకుండానే బయటకు పంపించేశాడు ఉపేంద్ర. క్లైమాక్స్ లో ఎన్ని ప్రశ్నలో. సినిమా మొదలైనప్పటి నుంచీ ఆడియన్కి ప్రతీ సీన్కీ ఓ ప్రశ్న మొలకెత్తుతూ ఉంటుంది. దేనికీ ఉపేంద్ర సమాధానం ఇవ్వలేదు. బహుశా తన దగ్గరే సమాధానం లేదనుకొంటా. లేదంటే ఈ సినిమా ఉపేంద్రలాంటి సో కాల్డ్ మేధావులకే అర్థం అవుతుందనుకొంటా. మొత్తానికి రెండున్నర గంటల పాటు ఉపేంద్ర రాచి రంపాలు పెట్టాడు.

టెక్నికల్గానూ ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేదు. ఏ సీన్ చూసినా ఉపేంద్ర తాలుకూ పైత్యం, భీభత్సం కనిపించడం తప్ప. కొన్ని సీన్లు బాగానే ప్రజెంట్ చేసినా - అందులో లెక్కలేనన్ని ప్రశ్నలు ఉదయించడంతో, వాటికి సమాధానాలు దొరక్క ప్రేక్షకులకు అసంతృప్తే మిగులుతుంది. ఉపేంద్ర ఎప్పట్లా పిచ్చపిచ్చగా నటించేశాడు. మిగిలినవాళ్లెవ్వరికీ పెద్దగా నటించే అవకాశం ఇవ్వలేదు. ఆ మాటకొస్తే ఏ పాత్రకీ అంత సీన్ లేకుండా పోయింది.

కథకుడిగా ఉపేంద్ర ఔట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలతో వస్తుంటాడు. ఆ తరహా సినిమాలు ఇష్టపడేవాళ్లకు ఉపేంద్ర నచ్చుతాడు. కాస్త లోతుగా ఆలోచిస్తే ఉపేంద్ర అర్థమవుతాడు. కానీ ఈ సినిమాలో దానికీ స్కోప్ లేదు. ఉపేంద్ర ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆడియాల్లో వరస్ట్ ఐడియా... ఉపేంద్ర 2. అంతకంటే ఈసినిమా గురించి ఇంకేం చెప్పలేం.

Unknown

Some say he’s half man half fish, others say he’s more of a seventy/thirty split. Either way he’s a fishy bastard.

0 comments: